: ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏదో తెలుసా?
ప్రపంచంలో ఎక్కువ మంది ఏ భాష మాట్లాడుతారంటే 'ఇంగ్లీష్' అని టక్కున సమాధానం చెప్పేస్తారు చాలామంది. అక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. ఎందుకంటే, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష చైనీయులు మాట్లాడే మాండరీన్. ప్రపంచ జనాభాలో సగమున్న చైనా, తైవాన్, హాంగ్ కాంగ్, మలేసియా దేశాలతో పాటు వంద కోట్ల మంది మాండరీన్ మాట్లాడుతారు. ప్రపంచంలో స్పానిష్ మాట్లాడే వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది. 35 దేశాల్లో 33.90 కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపాలన కారణంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇంగ్లీషు భాషను 110 దేశాల ప్రజలు మాట్లాడతారు. జనాభాపరంగా ఇంగ్లిష్ ను 33.50 కోట్ల మంది ప్రజలు మాతృభాషగా మాట్లాడితే, అందులో 22.50 కోట్ల మంది అమెరికన్లే ఉన్నారు. దీంతో ఈ విషయంలో ఇంగ్లీషు భాష మూడో స్థానం ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాన్ని అరబిక్ సొంతం చేసుకుంది. ప్రపంచంలోని 60 దేశాల్లో 24.20 కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతారు. ఏడో శతాబ్దంలో ముస్లిం పాలకుల సామ్రాజ్యాల విస్తరణ కారణంగా భాష కూడా విస్తరించింది. అయితే, నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు నేర్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. 150 కోట్ల మంది విద్యార్థులు ఇంగ్లీషు భాషను అభ్యసిస్తుండగా, 12.60 కోట్ల మంది విద్యార్థులు ఫ్రెంచ్, చైనా, స్పానిష్ భాషలను అభ్యసిస్తున్నారు. ఈ గణాంకాలను ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వెల్లడించింది.