: మాట వినకపోతే రాజీనామా చేస్తా!... ములాయం సింగ్ యాదవ్ కు సోదరుడి అల్టిమేటం!
వచ్చే ఏడాది దేశంలోనే కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అదికారం చెలాయిస్తున్న సమాజ్ వాదీ పార్టీకి ఈ దఫా వ్యతిరేక ఫలితాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరింత పకడ్బందీగా ఎన్నికలకు వెళదామని పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్న పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ లకు ప్రతి చిన్న అంశం కూడా ప్రతిబంధకంగానే మారుతోందట. ఇందుకు ఉదాహరణే ములాయం సింగ్ సోదరుడు, యూపీ రాష్ట్ర సీనియర్ మంత్రి, పార్టీ యూపీ ఇంచార్జ్ శివపాల్ యాదవ్ చేసిన తాజా ప్రకటన. పార్టీకి రాష్ట్ర ఇంచార్జ్ గా ఉన్నప్పటికీ తన మాట ఏ ఒక్కరూ వినడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన శివపాల్ యాదవ్ ఇదే పరిస్థితి కొనసాగితే, తాను తన పదవికి రాజీనామా చేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ములాయం సోదరుడిగా పార్టీలో మంచి మైలేజీ ఉన్నా... తన కేబినెట్ లోని చిన్నాన్నకు అఖిలేశ్ అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదట. మరోవైపు పార్టీ కార్యక్రమాల రూపకల్పన విషయంలోనూ తనకు తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఆయన నిన్న మెయిన్ పూరి సభలో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పరిస్థితి మారకపోతే తాను రాజీనామా చేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన పార్టీలో పెద్ద చర్చకే తెర తీసినట్లు సమాచారం.