: దమ్ముంటే నాతో చర్చకు రండి.. ముస్లింల విషయంలో అన్ని పార్టీలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సవాల్


భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక దేశంలోని ముస్లింల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క పార్టీ వారిని కొంచెం కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో దమ్ముంటే తనతో చర్చకు రావాలని అన్ని పార్టీలకు సవాల్ విసిరారు. లక్నోలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అసద్ స్వాతంత్ర్యానంతం ముస్లింల పరిస్థితి పెనం లోంచి పొయ్యి మీదకు పడినట్టు అయిందన్నారు. కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీ వారి సంక్షేమం గురించి ఆలోచించలేదని ధ్వజమెత్తారు. ‘‘ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు నన్ను మతవాదిగా పేర్కొంటున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నానని ఆరోపిస్తున్నారు. మరి వారిచ్చే స్టేట్‌మెంట్లకు పూల వర్షం కురిపించాలా?’’ అని ప్రశ్నించారు. ‘‘అన్ని పార్టీలకు నేను చాలెంజ్ చేస్తున్నా. దేశంలోని ముస్లింల పరిస్థితిపై చర్చకు రావాలని కోరుతున్నా’’ అని అసదుద్దీన్ అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు కూడా భాగమయ్యారని తెలిపారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మౌలానాలు ఫత్వాలు సైతం జారీ చేశారని, కానీ చరిత్రకారులు వాటిని విస్మరించారని హైదరాబాద్ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News