: సినిమా ప్రచారంలో పాల్గొన్న ధోనీ.. చాలా కష్టమైన పనని వ్యాఖ్య
'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' పేరిట రూపొందిన బాలీవుడ్ సినిమా ప్రచారంలో టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. టీమిండియా ప్లేయర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ధోనీ టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పడంతో ఆయన ఇండియాలోనే ఉన్నాడు. 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమాకి ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ చిత్రం ట్రైలర్‌ను ఆయన విడుదల చేశాడు. అనంతరం ధోనీ మాట్లాడుతూ.. సినిమాను ప్రచారం చేయడం ఎంతో కష్టమైన పనేనని అన్నాడు. అయినా అందులో పాల్గొనడం ఆనందంగానే ఉందని ధోనీ పేర్కొన్నాడు. తన చేతిలో ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఇందులో భాగమవుతున్నానని చెప్పాడు. సినీ నటులు తమ సినిమా షూటింగ్ పూర్తయ్యాక విధిగా ఆ చిత్రం ప్రచారంలో పాల్గొంటారని ఆయన అన్నారు. చిత్రం విడుదలకు రెండు వారాల ముందు నుంచే వారు వారి సమయాన్నంతా ప్రచారానికే అంకితం చేస్తారని అన్నాడు. ఈ విషయంలో నటులకు హ్యాట్సాఫ్ చెప్పాలని ధోనీ అన్నాడు.