: దళితులపై దాడి అమానుషం: వైఎస్ జగన్
తూర్పు గోదావరి జిల్లాలోని దళితులపై దాడి అమానుషమని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల దళితులపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడి అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ ఈరోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ, మనం 21వ శతాబ్దంలో ఉన్నామని, ఇంకా ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయంటే సిగ్గుతో సభ్యసమాజం తలదించుకోవాలని అన్నారు. ఏపీ హోం మంత్రి స్వగ్రామంలోనే ఈ దాడి జరగడం దారుణమన్నారు. ఇంతవరకూ బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించకపోవడం విచారకరమన్నారు. బాధితులకు రూ.లక్ష చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితులకు రూ.8 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.