: ఒకరికి ఒకరు తోడై జన సముద్రమైన వేళ... రైల్వేలపై ముంబై వాసుల పెను కోపాగ్ని!


రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం ఇండియాలో చాలా సహజం. ఒక్కోసారి పట్టరానంత కోపం కూడా వస్తుంది. అయితే దాన్ని ఎన్నడూ బయటపెట్టుకోలేక బీపీనీ పెంచుకుంటూ చాలా మంది ఉండిపోతారు. అదే రైలు ఆలస్యంపై ఒకరు స్పందించి నిరసనకు దిగిన వేళ, అతనికి తోడుగా, రైలు కోసం వేచిచూస్తున్న వందలాది మంది ప్రజలు కదిలితే... ఏం జరుగుతుంది? ముంబైలో అదే జరిగింది. దెబ్బకు రైల్వే మంత్రి స్వయంగా కదలాల్సి వచ్చింది. ప్రయాణికులకు భరోసా ఇస్తూ, సమస్యను తక్షణమే పరిష్కరిస్తానని ట్వీట్ చేసి, ప్రజలను సముదాయించిన తరువాతనే పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటన ముంబైలోని బదల్ పూర్ స్టేషన్లో జరిగింది. నిత్యమూ ముంబై నగరం మధ్యలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టర్మినస్ కు వస్తున్న రైళ్ల కారణంగా లోకల్ రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. లోకల్ రైళ్లు తమను సమయానికి గమ్యం చేర్చడం లేదన్న ఆగ్రహం ప్రయాణికుల్లో ఈ ఉదయం కట్టలు తెంచుకుంది. ఒకరికి ఒకరు తోడై వందలాది మంది ప్రయాణికులు వచ్చిన రైళ్లన్నింటినీ ఆపేశారు. ఉదయం 5:30 గంటలకు నిరసనలు ప్రారంభం కాగా, 11 గంటల వరకూ ఎక్కడి రైళ్లక్కడ నిలిచిపోయాయి. తొలుత చిన్న నిరసనగా పదుల సంఖ్యలో ప్రజలు రైళ్ల ఆలస్యంపై నినాదాలు చేయగా, నిమిషాల వ్యవధిలోనే వందల మంది చేరిపోయారు. ఆపై స్టేషన్ ను వదిలి పట్టాలపైకి వచ్చారు. వీరికి నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించినా వినలేదు. చివరికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు కల్పించుకుని ట్వీట్ చేశారు. రైల్వే జీఎం, డీఆర్ఎంలతో మాట్లాడానని, ఉదయం పూట ముంబై వాసుల కష్టాలు తీర్చేందుకు యత్నిస్తామని, అందరూ నిరసనలు విరమించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని మన్నించి తమ ధర్నాను విరమించారు. ఇకనైనా ముంబై రైళ్లు సమయపాలన పాటిస్తాయేమో చూడాలి!

  • Loading...

More Telugu News