: 73 టీవీ చానళ్ల అనుమతులు రద్దు చేసిన మోదీ సర్కారు
నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ, 73 టీవీ చానళ్లు సహా 24 ఎఫ్ఎం చానల్స్, 9 పత్రికలపై నిషేదం విధిస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. అప్ లింకింగ్ గైడ్ లైన్స్ పాటించనందుకు ఇంతవరకూ 73 చానళ్ల అనుమతులు రద్దు చేసినట్టు రాజ్యసభకు ఐ అండ్ బీ శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఈ టీవీ చానళ్లలో జస్ట్ టీవీ, ఖాస్, మోహువా పంజాబీ, మోహువా తెలుగు, విజన్ ఎంటర్ టెయిన్ మెంట్, కే టీవీ తదితరాలు ఉన్నాయి. గడచిన ఏడాది వ్యవధిలో వీటిని నిషేదించినట్టు ఆయన వివరించారు. వీటితో పాటు ఫోకస్ ఎన్ఈ, ఫోకస్ హర్యానా, ఎస్టీవీ, లెమన్ టీవీ తదితరాలకు హోం మంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వని కారణంగా వాటిని కూడా నిషేధించినట్టు పేర్కొన్నారు. ఆరు ప్రైవేటు ప్రసార సంస్థలకు చెందిన 24 ఎఫ్ఎం చానళ్లు పర్మిషన్ ఒప్పందాలు అతిక్రమించిన కారణంగా నిషేదించినట్టు తెలిపారు. ప్రింట్ మీడియాలో నిబంధనలకు కఠినతరం చేయనున్నామని, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్స్ చట్టం 1897ను సవరించనున్నామని రాజ్యవర్థన్ వివరించారు.