: సుష్మాను అడిగుండాల్సింది: షారూక్ ఖాన్ కు నెటిజన్ల ఉచిత సలహా!
లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు ఇమిగ్రేషన్ అధికారులు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ను ఎయిర్ పోర్టు బయటకు వెళ్లనీయకుండా అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన వేళ, తనకు ప్రతిసారీ అవమానం జరుగుతోందని షారూక్ వాపోయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు అమెరికా వచ్చినా తనకు ఇలానే అవుతోందని ట్విట్టర్ వేదికగా షారూఖ్ వెల్లడించగా, అతనికిప్పుడు ఉచిత సలహాలు వెల్లువెత్తుతున్నాయి. "షారూక్, సుష్మాజీని సంప్రదించు. అయితే సౌమ్యంగా అడగటాన్ని మరువకు. ఆమె సాయం చేస్తుంది" అని ఒకరు సలహా ఇచ్చారు. షారూక్ ఖాన్ అనే పేరు ఉగ్రవాదుల అనుమానిత పేర్లలో ఉండటంతో, అదే పేరుతో పాస్ పోర్టున్న ఈ హీరో, అమెరికాలో కాలు పెట్టినప్పుడల్లా విచారణను ఎదుర్కోక తప్పడం లేదు. అమెరికా ఇమిగ్రేషన్ టీము కొన్ని బాలీవుడ్ చిత్రాలను చూడాలని, ఇంత పెద్ద హీరోను అన్ని సార్లు ఎలా నిర్బంధిస్తారని, అమెరికా అధికారులు షారూక్ ఫ్యాన్స్ కాబట్టే, ఓ 2 గంటలు అతనితో గడిపేందుకు ఇలా చేస్తున్నారని నెటిజన్లు జోకుల మీద జోకులు పేలుస్తున్నారు.