: దుబాయ్ ఎయిర్ పోర్టులో ఆ విమానం ఎందుకు కూలిందంటే...!
తిరువనంతపురం నుంచి బయలుదేరిన 'ఫ్లై ఎమిరేట్స్'కు చెందిన బోయింగ్ 777 విమానం గతవారం దుబాయ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం సమయంలో ఏం జరిగింది? ఎలా ప్రమాదం నుంచి బయటపడగలిగారు? అన్నదానిపై పైలట్లు 'ఈవెంట్ సమరీ' పేరిట సమర్పించిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం... దుబాయ్ చేరిన విమానం రన్ వే పై సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. కానీ భీకరమైన గాలులు వీయడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం వారివల్ల కాలేదు. దీంతో విమానం వేగం కారణంగా రన్ వేపై కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో మళ్లీ గాల్లోకి విమానాన్ని లేపారు. ఇంతలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. గాలిలో సంభవించిన మార్పులతో విమానం వేగంలో మార్పు వచ్చింది. దీనికి తోడు వీస్తున్న గాలి తీవ్రత కారణంగా విమానం వేగం తగ్గిపోయినందువల్ల క్రాష్ ల్యాండ్ అయిందని వారు పేర్కొన్నారు. విమానం కడుపు భాగం (కింది భాగం) ఆధారంగా విమానం ఆగిందని వారు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ గాయాలు కాకపోవడం విశేషం. విమాన సిబ్బంది అప్రమత్తతతో 300 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆ తరువాత విమానం ముక్కలు కాగా రోల్స్ రాయిసీ ఇంజిన్లు పూర్తిగా తగలబడిపోయాయి.