: కంపెనీకి రాజీనామా చేసి వెళ్లేది ఎవరో ముందే ఊహిస్తున్న ఇన్ఫోసిస్!
సంస్థను వీడి వెళుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో, రాజీనామా చేసి వెళ్లేవారిని ముందుగానే గుర్తించేందుకు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీ బాటన నడుస్తోంది. గత కొన్ని వారాల వ్యవధిలో టాప్ లెవల్ ఉద్యోగులు ఎంతో మంది రాజీనామా చేసిన నేపథ్యంలో, తదుపరి టీమ్ లీడర్లను గుర్తించి, వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకూ నిర్ణయించింది. రాజీనామాలు చేసే ఆలోచనలో ఎవరున్నారన్న విషయాన్ని ముందుగా గుర్తించేందుకు సంస్థలో వివిధ స్థాయుల్లో పనిచేస్తున్న వారిపై 'ఆల్గోరిథమ్' పద్ధతిని వాడుతూ ఓ అంచనాకు వస్తున్నట్టు ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి శంకర్ వెల్లడించారు. ఇందుకోసం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ టూల్ ను తయారు చేశామని తెలిపారు. కొత్తగా లీడర్ షిప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. టాప్ 25 ఉద్యోగుల్లో రాజీనామా ఆలోచనలో ఉన్న వారెవరో సాధ్యమైనంత త్వరగా నిర్ణయించి వారి స్థానంలో క్రింది వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. భారతీ ఎయిర్ టెల్ లో పనిచేస్తూ, గత సంవత్సరం ఇన్ఫీలో చేరిన శంకర్ చెబుతూ, అమలు చేస్తున్న మొత్తం విధానం అట్రిషన్ ను తగ్గించేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగతంగా సామర్థ్యం ఉండి, ప్రోత్సాహం లేని వారిని గుర్తించి, వారికి మరిన్ని బాధ్యతలు అప్పగించి ముందుకు నడిపిస్తామని ఆయన అన్నారు. మొత్తం విధానం కార్యరూపం దాల్చడానికి మరింత సమయం పడుతుందని, కొత్తగా వచ్చే ఆర్డర్లు, సంస్థ విస్తరణ పనులను పాత టీములతో కాకుండా, కొత్త టీములతో జరిపిస్తామని ఆయన అన్నారు. లీడర్ షిప్ క్వాలిటీలను ఉద్యోగుల్లో పెంచేందుకు స్టాన్ ఫోర్డ్ వర్శిటీతో డీల్ కుదుర్చుకున్నామని, తొలి బ్యాచ్ లో 50 మంది శిక్షణ తీసుకున్నారని వివరించారు.