: భువనగిరి వ్యక్తులుగా నయీమ్ అనుచరులు కలిసివుండొచ్చు: ఉమా మాధవరెడ్డి
భువనగిరి ప్రజలతో సత్సంబంధాలున్న తనను నిత్యమూ ఎంతో మంది వచ్చి కలసి వెళుతుంటారని, వారిలో నయీమ్ అనుచరులు కూడా ఉండి ఉండవచ్చేమోనని మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చిన వారి సమస్య ఏమిటన్నదే తెలుసుకుంటాను తప్ప, వారు నయీమ్ మనుషులా? లేక ఎవరి అనుచరులన్న విషయాన్ని తానెన్నడూ పట్టించుకోలేదని తెలిపారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం ఉమా మాధవరెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి వుంటుందని డిమాండ్ చేశారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలు, నయీమ్ అసలు అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారని ఆరోపించిన ఆమె, వారిని కాపాడుకునేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏమీ సంబంధం లేనప్పుడు మీడియాను ఎందుకు పిలిచారని ఓ విలేకరి ప్రశ్నించగా, "తెలుగు మీడియాలో భువనగిరికి చెందిన ఓ మాజీ మంత్రి అని వచ్చింది. నేనేగా ఇక్కడున్న మాజీ మంత్రిని. ఆపై ఆంగ్ల పత్రికలో డైరెక్టుగా నా పేరు వచ్చింది. పొద్దుటి నుంచి ఎంతో మంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పాలని అడిగారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టాను" అని వివరణ ఇచ్చారు.