: తిరిగి లిబియా అధీనంలోకి సిర్టే.. నగరం నుంచి ఐఎస్ ఉగ్రవాదుల తరిమివేత
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులకు గట్టి పట్టున్న లిబియాలోని సిర్టే నగరాన్ని తిరిగి లిబియా అనుకూల దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జిహాదీలను తరిమికొట్టడంలో ఇదో ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే నగరంలోని ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐఎస్ ఉగ్రవాదులు దాక్కున్నట్టు అధికారులు పేర్కొన్నారు. లిబియాలోని గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ (జీఎన్ఏ) అభ్యర్థనతో అమెరికా సిర్టేలోని ఉగ్రవాద స్థావరాలపై వాయుదాడులకు దిగింది. అమెరికా దళాల సాయంతో ముందుకు సాగిన లిబియా దళాలు ఉగ్రవాదులను నగరం నుంచి తరిమికొట్టాయి. మరో మూడు నివాస ప్రాంతాలు, ఓ విల్లా కాంప్లెక్స్‌లో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు తమవద్ద సమాచారం ఉందని, త్వరలో వారిని కూడా మట్టుబెడతామని దళాలు పేర్కొన్నాయి. అయితే తాజా పోరులో ఎంతమంది ఉగ్రవాదులు మరణించింది తెలియరాలేదు. ఉగ్రవాదుల చెరనుంచి సిర్టేను బయటపడేసినట్టు దళాలు ప్రకటించాయి. గతేడాది జూన్‌లో ఈ నగరం ఐఎస్ అధీనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి పోరాడుతున్న లిబియా దళాలు ఏడాది తర్వాత తిరగి సిర్టేను స్వాధీనం చేసుకున్నాయి.