: పుష్కర భక్తుల కోసం 22 గంటల పాటు దుర్గమ్మ దర్శనం!


మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల నిమిత్తం విజయవాడకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని 22 గంటల పాటు కనక దుర్గమ్మ వారి దర్శనం కల్పించనున్నట్లు దేవాదాయ శాఖాధికారులు తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ వీ ప్రసాద్, కమిషనర్ వైవీ అనూరాధ, దుర్గ గుడి ఈవో సూర్యకుమారి మాట్లాడారు. పుష్కరాలు జరిగే రోజుల్లో అమ్మవారి దర్శన నిమిత్తం రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేశామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఐదు క్యూలైన్లలో భక్తులను అనుమతిస్తామని, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మర్నాడు రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నామని, అమ్మవారిని దర్శించుకునే భక్తులకు శఠగోపం, పండితుల ఆశీర్వాదాలు, ప్రసాదాలు అందజేయడాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరొచ్చినా ముఖమండపం దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వీఐపీలను దర్శనానికి అనుమతిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం, వీఐపీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకం వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆ వాహనాల్లోనే కొండపైకి వారు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రూ.500 టికెట్ కొనుగోలు చేసిన వారికి అమ్మ వారి శీఘ్ర దర్శనం కల్పిస్తామన్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ శాశ్వత ప్రాతిపదికన ఉంటుందని అధికారులు వివరించారు. దుర్గగుడిపై విధుల నిర్వహణ నిమిత్తం 600 మంది సిబ్బంది వచ్చారని, మరో వెయ్యిమంది ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను నియమించామని చెప్పారు. ఈ సందర్భంగా కొండపైకి ఏర్పాటు చేసిన క్యూలైన్ల గురించి కూడా వివరించారు. వినాయకుడి గుడి నుంచి ఒక క్యూ లైన్, కుమ్మరిపాలెం వైపు నుంచి మరో క్యూ లైన్ ఏర్పాటు చేసి టోల్ గేట్ వద్ద కలుపుతామని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మహామండపం, మల్లేశ్వరాలయం మీదుగా కొండ కిందకు దిగేలా ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశామని, రోజుకు 25 వేల మంది భక్తులకు అమ్మవారి అమ్మ ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశామని ఈవో సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రస్తుతం భక్తులు తలనీలాలు సమర్పించే అరండల్ సత్రాన్ని మూసివేస్తామని, దాని స్థానంలో పున్నమి, భవానీ, దుర్గా ఘాట్ లో కేశఖండన శాలలను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్ లో దుర్గమ్మవారి మూర్తులను ఏర్పాటు చేశామని, అక్కడ అమ్మవారికి ఏకహారతి ఇస్తామని, ప్రసాదాలను అందుబాటులో ఉంచామని ఈవో తెలిపారు.

  • Loading...

More Telugu News