: అప్పట్లో ఎంబీయే పూర్తైన తరువాత బిజినెస్ చేద్దామనుకున్నాను: విక్టరీ వెంకటేష్
విదేశాల్లో ఎంబీయే పూర్తి చేసిన తరువాత సుగంధ ద్రవ్యాల బిజినెస్ చేద్దామని ఆలోచించేవాడినని ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ తెలిపారు. 30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితం గురించి తాను ఊహించినట్టుగా జరగలేదని, భగవథేచ్చ ప్రకారం సినీ నటుడినయ్యానని అన్నారు. టాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో... ఓపక్క ఎంబీఏ పూర్తి చేసి, స్పెషలైజేషన్ చేసి, అఆలు నేర్చుకోవడమేంటని ఆలోచించేవాడినని అన్నారు. తెలుగు పలకడం సరిగ్గా వచ్చేది కాదని, రెండు గంటలు శిక్షణ తీసుకునేవాడినని, గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడినని, స్కూల్, కాలేజీల్లో కూడా అంత కష్టపడలేదని, ఆ డైలాగులు చదువుకునేందుకు ఓ రూంలోకి వెళ్లిపోయి బట్టీపట్టేవాడినని తెలిపారు. అయితే తన తండ్రి నుంచి సహజసిద్ధంగా అబ్బిన గుణం... ఏం చేసినా వంద శాతం కష్టపడడం అనేది తనను ఇన్నేళ్లు సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసిందని ఆయన చెప్పారు. ఇప్పటికీ తనకు కొన్ని విషయాలు అర్థం కావని ఆయన తెలిపారు. సెట్ కు వచ్చిన తరువాత దర్శకుడు ఎలా చెబితే అలా చేయడమే తనకు తెలిసిన విధానమని ఆయన తెలిపారు. అలా చేయడం వల్లే ఇప్పటికీ తనతో సినిమాలు చేసేందుకు దర్శకులు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.