: వెస్టిండీస్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌.. ఈ నెల 27 నుంచి టీమిండియాతో వెస్టిండీస్ ఢీ


నాలుగు నెల‌ల ముందు జ‌రిగిన టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ విజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్‌లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్ చూపిన బ్యాటింగ్ శైలి అద్భుతం. వ‌ర‌స‌గా నాలుగు సిక్స‌ర్లు కొట్టి త‌మ దేశానికి విజ‌యాన్నందించాడు. ఆయ‌న బ్యాటింగ్ తీరుకి క్రికెట్‌ అభిమానులంతా సెల్యూట్ కొట్టారు. దీంతో ఆయ‌న ఇప్పుడు ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా, ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొంటోంది. ఈనెల 27 నుంచి ఇరు జ‌ట్ల‌కి మ‌ధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ల‌కి బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆ దేశ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ బ్రౌన్ మీడియాకు ప‌లు విష‌యాలు వివ‌రించారు. టీ20 ఫార్మాట్‌లో బ్రాత్‌వైట్ మంచి ఫాం క‌న‌బ‌ర‌చాడ‌ని, క్రికెట్‌ మైదానంలో ఆయ‌న రాణిస్తూ యువ క్రికెటర్లను ప్రోత్స‌హిస్తూ వారిలో స్ఫూర్తి క‌ల‌గజేస్తాడ‌ని అన్నారు. కాగా, గ‌త టీ20 ప్రపంచకప్‌లలో రెండు సార్లు విజేతగా నిలిచిన వెస్టిండీస్‌కు సార‌థ్యం వ‌హించిన వెస్టిండీస్ టీమ్‌ కెప్టెన్‌ డారెన్‌ సామికి టీములో స్థానం ల‌భించ‌లేదు.

  • Loading...

More Telugu News