: రాజన్ దైవదూత అయితే... నేను దెయ్యాన్నా?: ఆర్బీఐ గవర్నర్ పై మరోమారు సుబ్రహ్మణ్యస్వామి అటాక్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామరాజన్ పై బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాటల దాడి కొనసాగుతోంది. ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ రెండో దఫా కూడా ఎంపిక కాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనపై స్వామి మాటల దాడిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆ ప్రయత్నాన్ని రాజన్ విరమించుకునేలా చేయడంలో స్వామి సఫలీకృతులయ్యారు. తాను రెండో దఫా ఆర్బీఐ గవర్నర్ గా ఉండబోనంటూ రాజన్ స్వయంగా ప్రకటించిన తర్వాత స్వామిపై బీజేపీ కన్నెర్రజేసింది. దీంతో నిన్నటిదాకా నోరెత్తని స్వామి... నిన్న మరోమారు రాజన్ పై మాటల దాడిని ప్రారంభించారు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాజన్ పై స్వామి తనదైన శైలిలో మాటల దాడిని కొనసాగించారు. ‘‘రాజన్ ను దైవదూతలా, నన్ను దెయ్యంలా మీడియా చిత్రిస్తోంది. ప్రచారం తీరు చూస్తే... మనల్ని రక్షించడం కోసం ఆయన విదేశాల నుంచి వచ్చినట్లుగా ఉంది. ఆయన్ను మీడియా బాగా ఎత్తేస్తోంది. రాజన్ వైదొలగితే... ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని భయపెట్టింది. కానీ వాస్తవంలో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. వడ్డీ రేట్లు పెంచి... చిన్న, మధ్య తరగతి పరిశ్రమల నిర్వాహకులకు అప్పులు పుట్టకుండా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్ నష్టం చేస్తున్నారు’’ అని స్వామి వ్యాఖ్యానించారు.