: ఆర్బీఐ గవర్నర్‌పై తాజా ఊహాగానాలు.. తెరపైకి గోకర్ణ్ పేరు
రఘురాం రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్ కాబోతున్నది ఎవరు..? నిన్నమొన్నటి వరకు బోల్డన్ని పేర్లు వినిపించాయి. అయితే ఎందుకనో ఈ విషయం ఒక్కసారిగా చల్లారింది. తాజాగా మళ్లీ గవర్నర్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్ పేరు తెరపైకి వచ్చింది. శుక్రవారం ఆయన ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్‌ను కలవడం, ఆ వెంటనే ఫైనాన్స్ సెక్రటరీ శక్తికాంత్ దాస్‌ను కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పేరు దాదాపు ఖాయమైనట్టేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వారం మొదట్లోనే కాబోయే గవర్నర్ పేరును ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే ద్రవ్య విధాన కమిటీ(మోనెటరీ పాలసీ కమిటీ-ఎంపీసీ)ని కూడా ఇదే వారంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంగళవారమే దీని గురించి ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ గిరీ కోసం పోటీపడుతున్న వారిలో పలువురి ప్రముఖుల పేర్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అర్వింద్ సుబ్రమణియన్, ప్రపంచ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌషిక్ బసు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగారియా, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్, ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్లు ఇందులో ఉన్నాయి.