: రాహుల్ గాంధీకి అసోం కోర్టు సమన్లు!... 29న స్వయంగా హాజరుకావాలని ఆదేశం!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తన జీవితంలోనే తొలిసారిగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మెట్టెక్కిన రాహుల్ గాంధీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కూ వెళ్లాల్సి వచ్చింది. తాజాగా అసోంలోని కామ్ రూప్ కు చెందిన కోర్టు రాహుల్ కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న జరగనున్న విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆయనకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్ లో రాహుల్ గాంధీ... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆరెస్సెస్ రాహుల్ గాంధీపై కామ్ రూప్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు పిటిషన్ లో కోర్టును ఆరెస్సెస్ కోరింది. ఈ పిటిషన్ పై నేటి ఉదయం విచారణ చేపట్టిన కోర్టు... ఈ నెల 29న వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని రాహుల్ ను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.