: మరికొన్ని గంటల్లో క్రీడా కుంభమేళా ప్రారంభం.. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల కోసం ఎదురుచూస్తున్న క్రీడాభిమానులు


విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద క్రీడా సంరంభం ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. రియో డి జెనిరో వేదికగా మరకానా స్టేడియంలో అత్యంత వైభవంగా జరగనున్న వేడుకలతో మహా క్రీడా కుంభమేళాకు తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మరకానా స్టేడియంలో ఆరంభోత్సవం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడున్నర గంటలపాటు ప్రారంభోత్సవం సాగనుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. ఆరంభ వేడుకల్లో ఆరువేలమందితో సాగే నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలు ఆతిథ్యం ఇవ్వనున్న మరకానా స్టేడియం సామర్థ్యం 78వేలు. రియో ఒలింపిక్స్ నిర్వహణకు మొత్తంగా రూ. 77.237 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు సాగే ఈ విశ్వక్రీడా సంరంభంలో 206 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 28 క్రీడల్లో 306 పతకాల ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పురుషులకు 161 విభాగాల్లో పోటీలు ఉండగా మహిళలకు 136 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇద్దరికీ కలిపి 8 ఈవెంట్లు జరుగుతాయి. క్రీడలు తిలకించే వారికోసం 75 లక్షల టికెట్లు విక్రయించారు. వీటిని తిలకించేందుకు 5 లక్షల మంది పర్యాటకులు రియో వస్తారని అంచనా వేస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడల టీవీ ప్రసార హక్కుల కోసం ఎన్బీసీ యూనివర్సల్ దాదాపు రూ. 8వేల కోట్లు చెల్లించింది. దక్షిణ అమెరికా ఖండంలో జరుగుతున్న తొలి ఒలింపిక్ క్రీడలు ఇవే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News