: ‘రియో’లో రెచ్చిపోతున్న చిల్లర దొంగలు... విదేశీయులే టార్గెట్!
ఈ నెల 6వ తేదీ నుంచి రియో ఒలింపిక్స్ ప్రారంభం కానుండటంతో సందడి మొదలైంది. రేపటి నుంచి రియో ఒలింపిక్ విలేజ్ లో 31 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ ఒలింపిక్స్ లో భారత్ మొత్తం 8 బంగారు పతకాలు సాధిస్తుందని గ్లోబల్ ఫైనాన్షియల్ రేటింగ్ జోస్యం కూడా చెప్పింది. ఇదిలా ఉంటే, రియోలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒలింపిక్స్ కోసం వస్తున్న విదేశీయులపై ఇక్కడి చిల్లర దొంగలు దాడి చేసి దొరికినంత దోచుకుపోతున్నారు. ఒంటరిగా లేదా జంటగా ఉన్న విదేశీయులనే వారు టార్గెట్ చేస్తున్నారు. ధైర్యం చేసి తిరగబడిన వారిని దొంగలు చితక్కొట్టడమో లేక అక్కడి నుంచి పారిపోవడమో చేస్తున్నారు. రియోలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని విదేశీయులు దొంగల దెబ్బకు హడలెత్తిపోతున్నారు. బయట తిరగాలంటే భయపడిపోతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. నడుచుకుంటూ వెళ్తున్నా, బస్సుల్లో కూర్చున్నా, షాపింగ్ చేస్తున్నా విదేశీయులపై చిల్లర దొంగలు తమ చేతివాటం చూపుతున్నారు. బంగారు గొలుసులు, పర్స్ లు, మొబైల్ ఫోన్లను చిల్లర దొంగలు చిటికెలో లాగేసుకుని పారిపోతున్నారు. రియో ఒలింపిక్స్ ప్రారంభం కాకముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే, మెగా ఈవెంట్ మొదలైన తర్వాత ఏ విధంగా ఉంటుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒలింపిక్స్ ప్రభావంతో బ్రెజిల్ ప్రధాన నగరం రియో లో క్రైమ్ రేటు రెట్టింపయింది. విదేశీయులు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడి పోలీసులు హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత క్రైమ్ రేట్ ఉన్న నగరాలలో రియో 11వ స్థానంలో ఉంది.