: పాక్ నుంచి వచ్చి నేరుగా మోదీతో భేటీ అయిన రాజ్‌నాథ్‌సింగ్
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈరోజు జరిగిన సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భారత్‌కు చేరుకోగానే నేరుగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. సార్క్ సదస్సులోని అంశాలను ఆయన మోదీకి వివరిస్తున్నారు. సదస్సులో తాను చేసిన ప్రసంగం ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి ఆయన మోదీకి వివరించారు. తాను సదస్సులో ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను, వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భారత్ మీడియాను పాక్ అడ్డుకొని తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం కాకుండా చేసిన అంశంపై ఆయన మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో మీడియాకు తన పాక్ పర్యటన అంశంపై ఏ విషయాలు చెప్పకుండా రాజ్‌నాథ్ సింగ్ నేరుగా మోదీకే వివరించడం గమనార్హం. సార్క్ సదస్సు వివరాలను రాజ్‌నాథ్ రేపు పార్లమెంట్‌లో వివరించనున్నట్లు తెలుస్తోంది.