: సూట్‌కేసులో 11 ఏళ్ల బాలుడిని తీసుకువెళుతూ దొరికిపోయిన యువతి!
బ్రెజిల్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సూట్‌కేసులో 11 ఏళ్ల బాలుడిని ఉంచి ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అటూ ఇటూ తిరిగింది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువతిని పట్టుకొని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. యువతిని గమనించిన పోలీసులు అమె వద్ద ఉన్న సూట్‌కేసుని ఓపెన్ చేశారు. అందులో 11 ఏళ్ల బాలుడు కనిపించాడు. బాలుడిని చూసిన పోలీసులు షాక్ తిన్నారు. షాక్ నుంచి తేరుకొని యువతిని ఆ అంశంపై ప్రశ్నించారు. పోలీసులకి తాను బాలుడిని ఎందుకు అలా తీసుకురారావాల్సి వచ్చిందో 23 ఏళ్ల నాటాషా విటోరియానో సౌటో వివరించింది. తనకు ఆ బాలుడు రోడ్డుపై కనిపించాడని, డ్రగ్స్‌కు బానిసలయిన ఆ బాలుడి తల్లిదండ్రులు బాలుడ్ని వేధిస్తున్నారని చెప్పింది. బాలుడు తనను కాపాడాలని ప్రాధేయపడ్డాడని తెలిపింది. దీంతో బాలుడిని రక్షించే క్రమంలో బాలుడిని సూట్‌కేసులో ఉంచి తన వెంట తన ఇంటికి తీసుకెళుతున్నానని చెప్పింది. పోలీసులు ఆ బాలుడిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి ఓ కెమెరా కంటికి చిక్కాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. బాలుడిని తీసుకొచ్చిన యువతిపై అభియోగాలు నమోదు చేయలేదు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.