: రండి బాబు రండి... సరసమైన ధరకే టర్కీ కరెన్సీ!
హైదరాబాదులో టర్కీ దేశపు కరెన్సీ అమ్మకం ముఠాలు పెరిగిపోతున్నాయి. టర్కీలోని లీర అనే కరెన్సీని ఆ దేశం 2003లో నిషేధించింది. అయితే ఈ నిషేధిత కరెన్సీని అడ్డం పెట్టుకుని ఇక్కడ అమ్మకందారులు పెరిగిపోయారు. పది లక్షల విలువ చేసే కరెన్సీని కేవలం 20 వేల రూపాయలకు ఇస్తామని చెప్పగానే అత్యాశాపరులు దానిని కొనేస్తున్నారు. ఆ తరువాత మోసపోయామని అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
హైదరాబాదులోని అమీర్ పేట్ లో పది మంది గ్యాంగ్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు పట్టుబడింది. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీ చేయగా 300 నిషేధిత టర్కీ కరెన్సీ లభ్యమైంది. వారిని విచారించగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్‌కు చెందిన గోపు రామలింగం, గుంటూరుకు చెందిన బల్ల హేమకుమార్ రెండు గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. వీరి నుంచి 440 కోట్ల రూపాయల విలువైన నిషేధ టర్కీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా నకిలీ కరెన్సీ డొంక కదిలింది. అయితే ఈ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందనేది పోలీసు దర్యాప్తుకు అంతుచిక్కడం లేదు. కొంత మంది నుంచి కొనుగోలు చేసి తాము కూడా ఇలాగే మోసపోయామని, దీంతో వాటిని వదిలించుకునేందుకు తామే విక్రేతలుగా మారామని వారు చెప్పడంతో పోలీసులు షాక్ తినగా, పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమానికి గతంలో టర్కీ భక్తులు విరాళంగా ఈ కరెన్సీ ఇచ్చినట్టు తెలిసింది.
అయితే గతంలో ట్రస్ట్ ఆర్థిక అంశాలు పరిశీలించిన సమయంలో ఈ నోట్లు పనికిరావని తేలడంతో వాటిని ట్రస్టు సిబ్బంది బయట పడేశారు. వీటిని స్థానికులు తీసుకుని ఇలా చలామణి చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవి నిషేధిత నోట్లని తెలియక పలువురు కొనుగోలు చేసి మోసపోతున్నారని వారు గుర్తించారు.