: లోపాలు లేవని ఎలా అంటారు? ఎంత పన్నో చెబితేనే జీఎస్టీకి మద్దతు: 'చిద్దూ' మెలిక
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ - వస్తు సేవల పన్ను) సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ సాగుతోంది. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రసంగిస్తూ, బిల్లులో లోపాలే లేవనడం అధికార పక్షం డొల్లతనాన్ని సూచిస్తోందని ఎద్దేవా చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను విధానానికి తమ పార్టీ వ్యతిరేకమని, గతంలో ఇదే బిల్లును వ్యతిరేకించిన బీజేపీ, ఇప్పుడు మరింత అసమగ్రంగా ప్రతిపాదనలతో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లులో భాగంగా, ఎంత పన్నును విధించనున్నారన్న విషయాన్ని స్పష్టంగా చెబితేనే కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఆయన మెలిక పెట్టారు. వస్తు సేవల పన్ను గరిష్ఠంగా 18 శాతం వరకూ ఉంటే తమకు ఆమోదయోగ్యమని, అంతకన్నా పెంచాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకుని తీరుతామని చిదంబరం తెలిపారు. ఈ బిల్లుకు మరో మూడు సవరణలు చేయాల్సి వుందని, అప్పుడు మాత్రమే పూర్తి పారదర్శకతో బిల్లు ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పన్నుల రేట్లు మార్చాలని చూస్తే, పార్లమెంటు ఆమోదంతోనే అది సాధ్యపడేలా మరో సవరణ అత్యంత కీలకమని, దాన్ని కూడా బిల్లులో చేర్చాలని చిదంబరం డిమాండ్ చేశారు. ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం మోపేదిగా ఇప్పుడున్న ప్రతిపాదనలు కనిపిస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో పన్ను గరిష్ఠ పరిమితి దాటనివ్వబోమని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి వుందని, దానికి కూడా చట్ట రూపం కావాల్సిందేనని అన్నారు.