: భారీ శబ్దాలు వినపడే ప్రదేశాల్లో కాఫీ తాగుతున్నారా? జరభద్రం!
కాఫీ తాగడం ఎంతో మంది దినచర్యలో భాగస్వామ్యమయిపోయింది. ఉదయం లేవగానే కడుపులో కాఫీ పడాల్సిందేనని కోరుకునే వారు ఎందరో..! కాఫీ తాగకపోతే కొందరు తమ దినచర్యలో ఏదో లోటుకి గురవుతున్నట్లు ఫీలయిపోతుంటారు. అయితే, ప్రతి రోజు కాఫీ తాగే వారిని గురించి పరిశోధన చేసిన కెనడాలోని మెక్‌గ్రిల్ యూనివర్సిటీ పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారీ శబ్దాలను ప్రతిరోజూ చాలా దగ్గరగా వినేవారు ఆ సమయంలో కాఫీ తాగే అలవాటుకు గుడ్ బై చెబితే మంచిదని వారు సూచించారు. భారీ శబ్దాలు వచ్చే నిర్మాణ రంగం, పబ్బులు, పేలుళ్లు ఎక్కువగా వినిపించే ప్రదేశాల్లో పనిచేసేవారికి కాఫీ అలవాటు ఉంటే వారి చెవులకి ప్రమాదం అధికంగా ఉంటుందని తేల్చిచెబుతున్నారు. ఆయా ప్రదేశాల్లో పని చేసేవారికి రెండు మూడు రోజుల వరకూ ఆ శబ్దాలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉండడం సాధారణమేనని ఇటువంటి స్థితిలో వారు కాఫీ తాగితే వినికిడి శక్తి తగ్గుతుందని వారు పేర్కొన్నారు భారీ శబ్దాల వద్ద పనులు చేసే వారిని రెండు గ్రూపులుగా విభజించి తాము చేసిన పరిశోధనల్లో ఈ అంశం రుజువయినట్లు వారు చెబుతున్నారు. తమ పరిశోధనలో భాగంగా ఒక గ్రూపు వారికి పని స్థలంలోనే కాఫీ ఇచ్చి, మరో గ్రూపు వారికి వారి పని అయిపోయిన కొన్ని గంటల తరువాత కాఫీ ఇచ్చారు. అనంతరం ఇరు గ్రూపుల వ్యక్తుల వినికిడి శక్తిని పరిశీలించి చూశారు. వీరిలో భారీ శబ్దాలు వింటూ కాఫీ తాగిన వారికి చెవుల వినికిడి శక్తి తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. పని సమయంలో కాఫీ తాగని వ్యక్తుల్లో ఇటువంటి లోపం కనిపించలేదని వారు పేర్కొన్నారు. దీనిపై పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. వారి వినికిడి శక్తి తగ్గడానికి కాఫీ మాత్రమే కారణమయిందా? అనే అంశం మీద పరిశోధన కొనసాగిస్తున్నారు.