: వేశ్యావాటికలు, డ్యాన్స్ బార్లకు విక్రయం, ముసలోడితో పెళ్లి... 2006లో కిడ్నాపైన ఢిల్లీ బాలిక దీన గాధ!


2006 జూన్ లో ఈశాన్య ఢిల్లీలోని ఖుజారీ ఖాస్ ప్రాంతం నుంచి కిడ్నాపైన 12 ఏళ్ల బాలిక మాలా (పేరు మార్చాం), ఇప్పుడు 22 ఏళ్ల వయసులో తిరిగి తల్లిదండ్రులను చేరుకుంది. ఈ పదేళ్లా 28 రోజుల కాలంలో తాను పడ్డ బాధను ఆ యువతి పంచుకుంది. కిడ్నాప్ చేసిన ఆ బాలికను లైంగిక బానిసగా మార్చారు. పదే పదే వృద్ధులకు విక్రయించి పెళ్లిళ్లు చేశారు. వేశ్యా వాటికలకు కాంట్రాక్టుకు ఇచ్చారు. డ్యాన్స్ బార్లకు అమ్మారు. తన ఇద్దరు పిల్లలనూ దూరం చేశారు. తాను పడ్డ కష్టాలను ఆమె పోలీసులకు వివరించింది. గత నెల 24వ తేదీన మాల ఇంటికి చేరుకోగా, తాను ఏదో దయ్యాన్ని చూస్తున్నానని అమె తల్లి తొలుత భయపడింది. చూసి ఆనందబాష్పాలు రాల్చేందుకు ఆమె తండ్రి ఇప్పుడు లేడు. 2006లో తన కుమార్తె తప్పిపోయిందని ఆయన చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన జంతర్ మంతర్ పోలీసులు, తమకు ఎలాంటి సమాచారం అందలేదని 2008లో కేసును మూసివేయగా, గుండెపోటుతో ఆయన మరణించాడు. తాను పడ్డ బాధను వివరించిన మాల, పదేళ్ల క్రితం తన బంధువుల ఇంటికి వెళ్లిన వేళ, ఓ మారుతీ వ్యాన్ వచ్చి పక్కనే నిలిచిందని, ఇద్దరు వ్యక్తులు తన ముక్కుపై మత్తుమందు ఉంచిన గుడ్డను అదిమి, కారులోకి నెట్టేసి తీసుకువెళ్లిపోయారని పేర్కొంది. తెలివి వచ్చేసరికి అంబాలా ప్రాంతంలో మరికొందరు అమ్మాయిలతో తాను ఉన్నానని, కొద్ది రోజుల తరువాత గుజరాత్ కు చెందిన రైతుకు విక్రయించారని, ఆయన తనను పొలం పనికి కుదర్చగా, ఆయన కుమారుడు తనపై ప్రతి రాత్రీ అఘాయిత్యం చేసేవాడని, తాను ఎదిరిస్తే, చాకులతో గుచ్చేవాడని, వాతలు పెట్టాడని చెప్పింది. రెండేళ్ల తరువాత అక్కడి నుంచి పారిపోయి కచ్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చేరుకుంటే, తొలుత కిడ్నాప్ చేసిన ఇద్దరూ తిరిగి తనను పట్టుకున్నారని, ఈ సారి వేశ్యావాటికకు అమ్మేసి తన జీవితాన్ని మరింత నాశనం చేశారని చెప్పింది. ఏడేళ్ల నరకయాతన తరువాత, తనను కిడ్నాప్ చేసిన జంటకు బంధువైన ఓ వ్యక్తి వచ్చి, విడిపిస్తానని చెప్పి భటిందా తీసుకెళ్లి, మత్తుమందులకు అలవాటు పడ్డ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత, ఆయన చనిపోగా, ఆయన తమ్ముళ్లు తనను లైంగికంగా వేధించారని, ఎదురు తిరిగితే, పిల్లలను తీసుకుని, తనను ఓ డ్యాన్స్ బార్ కు విక్రయించారని పేర్కొంది. అక్కడ ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి కనిపించడంతో, తన దీనగాథను వివరించానని, ఆమె కొంత డబ్బు ఇవ్వడంతో ఢిల్లీకి చేరుకున్నానని, ఇక్కడ కూడా ఇంటిని కనుక్కునేందుకు ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు తన బిడ్డలను తనకు అప్పగిస్తే చాలని వేడుకుంది. ఆమె స్టేట్ మెంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News