: ట్రంప్ పై ఒబామా ఘాటు వ్యాఖ్యలు!... అమెరికా అధ్యక్ష పదవికి తగరని కామెంట్!
అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆ దేశంలో మాటల తూటాలు పేలుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో వారిద్దరూ పరస్పరం ఘాటు విమర్శలు చేసుకుంటూ ఉండగా, తాజాగా హిల్లరీ తరఫున ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా రంగంలోకి దిగారు. డొనాల్డ్ ట్రంప్ పై ఒబామా నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ సరితూగరని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో నిన్న జరిగిన మీడియా సమావేశంలోనే ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ సరితూగరని గత వారమే చెప్పానని పేర్కొన్న ఒబామా... ఆ విషయాన్ని ట్రంప్ తాజాగా నిరూపిస్తున్నారని కీలక వ్యాఖ్య చేశారు. ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకుని రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థిని మార్చాలని ఆయన సూచించారు.