: రాణీముఖర్జీ సహా పలువురి బండారాన్ని బయటపెట్టిన 'ఐటీ' ఇన్ ఫార్మర్... వెంటనే రివార్డు ఇమ్మని హైకోర్టు ఆదేశం


ప్రముఖ బాలీవుడ్ నటి రాణీముఖర్జీ, నటుడు శేఖర్ సుమన్, బాలాజీ టెలిఫిలింస్, అధికారి బ్రదర్స్ సహా 16 సంస్థల ఆదాయాన్ని బయటపెట్టిన ఓ ఐటీ ఇన్ ఫార్మర్ కు రూ. 5 కోట్ల రివార్డు అందజేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం రహస్య ఆస్తులు, ఆదాయం గురించి సమాచారం అందించిన వారికి (ఇన్ ఫార్మర్) వసూలు చేసిన ఆదాయపు పన్నులో 7.5 శాతం నుంచి 10 శాతం మొత్తాన్ని రివార్డుగా అందించాల్సి ఉంటుంది. ముంబయికి చెందిన ఓ ఐటీ ఇన్ ఫార్మర్ 1990 నుంచి 2000 సంవత్సరాల వరకు ఈ తరహా సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేయడం, వారు ఆయా వ్యక్తులపై దాడులు నిర్వహించి రూ.50 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అయితే, సదరు ఐటీ ఇన్ ఫార్మర్ కు అందాల్సిన రివార్డ్ మాత్రం ఇంతవరకూ దక్కలేదు. ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన రివార్డు కోసం 2009లో ఐటీ శాఖ కార్యాలయం ముందు దీక్ష చేయడంతో, అప్పటి ఆదాయపు పన్ను శాఖ డైరెక్టరు జనరల్ మూడు నెలల్లోగా ఆ రివార్డు ఇస్తామని ఆ ఐటీ ఇన్ ఫార్మర్ కు చెప్పి ఆయన్ని శాంతింపజేశారు. కానీ, సదరు అధికారి ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేదు. దీంతో, సదరు ఐటీ ఇన్ ఫార్మర్ బాంబే హైకోర్టును ఆశ్రయించి, తన రివార్డు తనకు ఇప్పించాలని హైకోర్టును కోరాడు. కేసును విచారించిన కోర్టు ఆరు నెలల్లోగా రూ.5 కోట్ల రివార్డును అతనికి అందజేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఆదేశించినట్లు సదరు ఐటీ ఇన్ ఫార్మర్ తరపు న్యాయవాది బ్రిజేష్ పాఠక్ తెలిపారు. కాగా, తనకు యాభై ఏళ్ల వయసొచ్చిందని, తాను ప్రాణాలకు తెగించి అక్రమ ఆస్తులు, ఆదాయం సంపాదించిన వారి సమాచారాన్ని తెలుసుకుని సంబంధిత అధికారులకు తెలియజేసినా తనకు దక్కాల్సిన రివార్డు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వాపోతూ ఐటీ ఇన్ ఫార్మర్ పిటిషన్ వేశాడు. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం ఇన్ఫార్మర్ల పేరు సహా వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

  • Loading...

More Telugu News