: రియోకు చేరిన తొలి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా!
ఇప్పటికే పలువురు టెన్నిస్ ఆటగాళ్లు, భద్రతా కారణాలు, జికా వైరస్ భయాలను చూపుతూ రియో ఒలింపిక్స్ కు డుమ్మా కొట్టిన వేళ, అక్కడికి చేరిన తొలి టెన్నిస్ స్టార్ గా సానియా మీర్జా నిలిచారు. మాంట్రియల్ రోజర్స్ కప్ లో ఆడిన సానియా, అటు నుంచి నేరుగా రియోకు చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సానియాకు ఇది మూడవ ఒలింపిక్ పోటీలు కాగా, ఈ దఫా ఆమె ఖాతాలో ఓ మెడల్ ఖాయమని టెన్నిస్ అభిమానులు భావిస్తున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో ప్రార్థనా థోంబరేతో, మిక్సెడ్ డబుల్స్ లో రోహన్ బొప్పన్నతో కలసి ఆమె ఆడుతున్న సంగతి తెలిసిందే. మహిళల డబుల్స్ విభాగంలో పతకంపై ఆశలు కొంతమేరకే ఉండగా, మిక్సెడ్ డబుల్స్ లో రోహన్ తో కలసి ఆమె పతకాన్ని పట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని క్రీడా పండితులు భావిస్తున్నారు.