: పోకేమాన్ ఆడుతూ కామాంధులకు చిక్కిన బాలిక... పర్యవసానంగా న్యూయార్క్ గవర్నర్ సంచలన నిర్ణయం!
న్యూయార్క్ లో 14 ఏళ్ల మెరీనా అనే విద్యార్థిని, తన స్మార్ట్ ఫోన్ లో అగుమెంటెడ్ రియాలిటీ గేమ్ షో పోకేమాన్ ను డౌన్ లోడ్ చేసుకుని దాన్ని ఆడుతూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి దారుణంగా అత్యాచారానికి గురి కావడంపై న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కొమో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 3 వేల మందికి పైగా అత్యాచార కేసుల్లో శిక్షలను అనుభవిస్తూ, పెరోల్ పై ఉన్నారని, వీరందరి చిరునామాలు, వాళ్లు ఎక్కడ తిరుగుతుంటారన్న విషయాలు పోలీసులకు తెలుసునని వ్యాఖ్యానించిన ఆయన, ఆయా ప్రాంతాల్లో పోకేమాన్ లను ఉంచరాదని గేమ్ సృష్టికర్తలను కోరారు. రేపిస్టుల వివరాలు, చిరునామాలను నింటెండో, నియాంటిక్ సంస్థలకు పంపాలని పోలీసులను ఆదేశించిన ఆయన, ఆయా ప్రాంతాల్లో పోకేమాన్ లను పెట్టవద్దని చెప్పారు. గేమ్ పరిధిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ డెవలపర్లకు ఈ-మెయిల్స్ పంపారు. ఆటలో నిమగ్నమై ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి అపాయాల బారిన పడితే వారిని కాపాడేది ఎవరని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా గేమ్ ఆడుతున్నారని, వారిలో చిన్నారులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, న్యూయార్క్ మేయర్ ప్రకటనపై నింటెండో సంస్థ ఇంకా స్పందించలేదు.