: మూడు నెలల్లోగా న్యాయం చేస్తే సరే.. లేకుంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం: హెచ్చరించిన బులంద్‌షహర్ అత్యాచార బాధితులు


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్‌షహర్ రేప్ కేసు బాధితులు పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. మూడు నెలల్లోగా తమకు న్యాయం అందించాలని, లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ‘‘మా అమ్మాయి, భార్య ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేరు. మేం గత 18 సంవత్సరాలుగా నోయిడాలోనే ఉంటున్నాం. ఈ ఘటన తర్వాత అక్కడికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో అర్థం కావడం లేదు. మాకు న్యాయం చేయాలని నోయిడా పోలీసులను అభ్యర్థిస్తున్నా. వారికి మూడు నెలల గడువు ఇస్తున్నా. అప్పటికీ దోషులకు శిక్ష పడకుంటే మేం ముగ్గురం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం’’ అని బాధితుడు పేర్కొన్నాడు. బాధిత కుటుంబం శుక్రవారం రాత్రి కారులో తమ స్వగ్రామం షాజన్‌పూర్ వెళ్తుండగా ఘజియాబాద్-అలీగఢ్ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు వారిని అడ్డగించి డబ్బు, బంగారం దోచుకున్నారు. అనంతరం మహిళ, ఆమె 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘‘ఇద్దరు వ్యక్తులు నా భార్య, కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డారు. మాతోపాటు మా పెద్దన్నయ్య భార్య కూడా ఉన్నారు. ఆమె బాగా వయసున్నట్టు కనిపిస్తుండడంతో దుండగులు ఆమెను వదిలేశారు. అత్యాచారానికి ముందు తమను చంపేయాలని వారిని కోరాం. దీంతో వారు మాపై దాడిచేసి కొట్టారు. మా నుంచి రూ.21 వేల నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు’’ అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. బులంద్‌షహర్ రేప్ ఘటన దేశ ప్రజలను షాక్‌కు గురిచేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితులను పట్టుకునేందుకు 300 మందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News