: కేజ్రీవాల్ రెండు పర్యటనల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు 500 రూపాయలే!: గోవా మంత్రి ప్రకటన
వచ్చే ఏడాది గోవాలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీతో పోటీ పడేందుకు సిద్ధమని ప్రకటించిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా గోవా ప్రభుత్వం ఆయన టూర్ సందర్భంగా చేసిన ఖర్చుపై ప్రకటన చేసింది. గోవా వికాస్ పార్టీకి చెందిన ఫ్రాన్సిస్కో మిక్కీ, గోవా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేజ్రీవాల్ కోసం ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. కేజ్రీవాల్ రెండు పర్యటనలకు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం కేవలం 500 రూపాయలని గోవా ప్రభుత్వ ప్రొటోకాల్ మంత్రి దిలీప్ పరులేకర్ శాసనసభలో ప్రకటించారు. కేజ్రీవాల్ కోసం ప్రభుత్వ వాహనాలను, రాష్ట్ర అతిథి గృహాన్ని కేటాయించామని చెప్పిన ఆయన, కేజ్రీవాల్ వాటిని వినియోగించలేదని, ఆయనను ఆహ్వానించిన సమయంలో ఇచ్చిన పుష్పగుఛ్ఛాలను మాత్రమే స్వీకరించారని, వాటికి 500 రూపాయలు ఖర్చయిందని ఆయన తెలిపారు.