: గోవాలో ముందస్తు ఎన్నికలా?.. నో ఛాన్స్!: గోవా ముఖ్యమంత్రి
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గోవాలో వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా దాని కంటే ముందే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ స్పందించారు. తమ పార్టీ ఐదేళ్ల వరకు అధికారంలోనే ఉంటుందని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలు రావని తేల్చిచెప్పారు. ఐదేళ్లకు కనీసం ఐదు వారాలు, నాలుగు వారాలు కూడా తగ్గవని, పూర్తిగా ఐదేళ్లు పూర్తయ్యాకే గోవాలో ఎన్నికలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘వచ్చే నవంబరులోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తే ఏం చేస్తారు?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు పర్సేకర్ సమాధానం చెప్పలేదు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోమని శివసేన పార్టీ పేర్కొన్న అంశంపై ఆయన స్పందిస్తూ.. ఆ పార్టీ తమతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీకి నష్టం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తమ పార్టీ మంచి విజయాలను సాధిస్తోందని, గోవా ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని ఆయన అన్నారు.