: అప్పు ఎగ్గొడదామంటే ఇక కుదరదు!... లోక్ సభ ముందుకు నేడు రుణ రికవరీ బిల్లు!
వ్యాపారం పేరిట బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని దానిని ఎగవేద్దామంటే ఇకపై కుదరదు. బ్యాంకుల తరఫున రంగంలోకి దిగనున్న ప్రభుత్వం రుణదాతల నుంచి ముక్కు పిండి మరీ రుణాన్ని వసూలు చేయనుంది. అంటే... ఇకపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాలా రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేయడం ఎంతమాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఈ మేరకు రుణ దాతల నుంచి అప్పుల వసూలు కోసం ఉద్దేశించిన రుణ రికవరీ బిల్లు నేడు లోక్ సభ ముందుకు రానుంది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ఆమోదం లభించే విషయంలో విపక్షాల నుంచి ఎలాంటి అడ్డంకులు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే జరిగితే... ప్రస్తుతం బ్యాంకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏలు) ఇట్టే కరిగిపోతాయన్న వాదన వినిపిస్తోంది. వెరసి ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదంతో బ్యాంకులకు కొత్త జీవం వచ్చినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.