: ఈ దఫా మీ మాటే నామాట... పంద్రాగష్టున ఏం మాట్లాడాలో చెప్పండి: ప్రజలను కోరిన మోదీ


"ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం వేళ నా ప్రసంగాన్ని ఇవ్వను. ఎర్రకోటపై నేను ఏం మాట్లాడాలో మీరే చెప్పండి. నేను ఏం మాట్లాడాలన్న విషయాన్ని నరేంద్ర మోదీ యాప్ కు పంపించండి" అని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ ఉదయం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, రియోకు వెళుతున్న భారత క్రీడాకారులకు కూడా తన పేరిట ఉన్న యాప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. గర్భవతులైన మహిళల శ్రేయస్సు కోసం 'ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్' పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి గర్భవతీ నెల నెలా ఉచిత వైద్యాన్ని అందుకోవచ్చని అన్నారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పుట్టినవారిలో తాను తొలి ప్రధానినని గుర్తు చేసిన మోదీ, ఇది తనకెంతో గర్వకారణమని అన్నారు. అలీగఢ్ రైల్వే స్టేషన్ ను మరింత పచ్చదనంతో నింపేందుకు కృషి చేస్తున్నానని, దేశం నుంచి డెంగ్యూను పారద్రోలేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దోచుకునేలా తప్పుడు కాల్స్, మెయిల్స్ రావడం పెరిగిపోయిందని, వీటి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పచ్చదనాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ, ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. ఇటీవలి తన దక్షిణాఫ్రికా పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఈ టూర్ తనకు బిజినెస్ టూర్ కాదని, ఓ యాత్రని అన్నారు. మోహన్ దాస్ ను మహాత్మాగా మార్చిన రైలులో తాను ప్రయాణించడం తనకు లభించిన వరమని అభివర్ణించారు. దేశంలోని రైతులు కలపను అందించే పంటలు వేయాలని, తద్వారా ఫర్నీచర్ కు అవసరమయ్యే కలపను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుందని సూచించారు. భవిష్యత్తంతా సాంకేతికతపై ఆధారపడి సాగనుందని, ఈ దిశగా ప్రతి భారత పౌరుడూ మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని సూచించారు. ఏవైనా రుగ్మతల బారిన పడ్డ వారు వైద్యులు సూచించిన విధంగా ఔషధాలను పూర్తిగా వాడాలని, కొద్దిగా తగ్గిందని మందల వాడకాన్ని పక్కన పెట్టరాదని అన్నారు. డాక్టర్లు చెప్పకుండా యాంటీ బయాటిక్స్ వాడటాన్ని మానివేయాలని మోదీ సూచించారు.

  • Loading...

More Telugu News