: దళితులను తరలించలేకపోయిన బీజేపీ... ఆగ్రా ర్యాలీని రద్దు చేసుకున్న అమిత్ షా!
ఆగ్రాలో అమిత్ షా తలపెట్టిన ర్యాలీ రద్దయింది. దళితులకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందన్న సంకేతాలను పంపాలని భావించిన పార్టీ అధిష్ఠానం 'ధమ్మ చేతన యాత్ర' పేరిట ర్యాలీ నిర్వహించాలని భావిస్తూ, కనీసం 40 వేల మందిని తరలించాలని ప్రయత్నించి విఫలం కావడంతోనే ఇందులో పాల్గొనాల్సిన అమిత్ షా దీన్ని రద్దు చేశారని తెలుస్తోంది. నేడు ఈ యాత్ర సాగాల్సి వుండగా, వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేదని చెబుతూ రద్దు చేసినట్టు ప్రకటన వెలువడింది. కాగా, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్యూలో కన్హయ్య వివాదం, దళితులకు రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు, గోరక్ష పేరిట జరుగుతున్న హింసాకాండ, బీజేపీ చీఫ్ మాయావతిని వేశ్యతో పోలుస్తూ, బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు... ఇవన్నీ పార్టీని దళితులకు దూరం చేశాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ర్యాలీలో పాల్గొనేందుకు అనుకున్న సంఖ్యలో దళితులు అంగీకరించని కారణంగానే ఇది రద్దయినట్టు సమాచారం. కాగా, మరోరోజు యాత్రను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.