: అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన సెన్సెక్స్, దూసుకెళ్లిన చిన్న కంపెనీలు
బెంచ్ మార్క్ సూచికలు 15 నెలల గరిష్ఠ స్థాయిలో ఉన్న వేళ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రయత్నించడంతో భారత స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఇదే సమయంలో యూరప్ మార్కెట్ల సరళి సైతం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడం, ఐటీ కంపెనీల నష్టాలు లార్జ్ క్యాప్ కంపెనీలను కోలుకోనీయలేదు. ఇదే సమయంలో స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల్లో ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు పెట్టుబడిదారులు పోటీ పడ్డారు. దీంతో స్మాల్, మిడ్ క్యాప్ సెక్టార్లు లాభపడ్డాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే కిందకు జారిన సూచికలు మధ్యాహ్నం తరువాత మరింతగా కిందకు వచ్చాయి. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 156.76 పాయింట్లు పడిపోయి 0.56 శాతం నష్టంతో 28,051.86 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 27.80 పాయింట్లు పడిపోయి 0.32 శాతం నష్టంతో 8,638.50 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.70 శాతం, స్మాల్ కాప్ 0.23 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 24 కంపెనీలు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, జడ్ఈఈఎల్, లుపిన్, టాటా పవర్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, బీహెచ్ఈఎల్, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,894 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,224 కంపెనీలు లాభాలను, 1,457 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గురువారం నాడు రూ. 1,08,64,446 కోట్లుగా నమోదైన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,08,63,581 కోట్లకు తగ్గింది.