: సీట్లయినా, ఉద్యోగమైనా.. బీహారీల తర్వాతే.. ఆంధ్ర, తెలంగాణలా రిజర్వేషన్ విధానం ఉండాలన్న లాలూ
ఉద్యోగాలైనా, విద్యాసంస్థల్లో సీట్లయినా బీహారీల తర్వాతే ఇతర రాష్ట్రాల వారికి కేటాయించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 80 శాతం ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లను బిహారీల కోసం రిజర్వు చేయాలని ఆయన కోరారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లా బీహార్‌లోనూ అన్ని విషయాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగాలు, సీట్ల విషయంలో 80 శాతం స్థానికులకు రిజర్వ్ చేయాలి’’ అని లాలూ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నితిష్ కుమార్ వద్ద ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత నితిష్ ప్రభుత్వంలో ఆర్జేడీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు లేకపోవడంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని లాలూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రిజిర్వేషన్ల విధానం కారణంగా వీరికి ఉద్యోగాలు లభించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు బీహార్‌లో ఉద్యోగాలు పొందుతున్నారని, దీనివల్ల స్థానికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో 80 మంది ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగాలు రావడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని మాజీ సీఎం వివరించారు. కాబట్టి ఇక ముందు ఈ విధానం మారాలని, విద్య, ఉద్యోగం విషయాల్లో రిజర్వేషన్ విధానం ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.