: భయపెడుతున్న 'సెల్ ఫోన్ సిమ్ స్వాప్'... తప్పించుకోవచ్చిలా!


దైనందిన జీవితంలో బ్యాంకు ఖాతాల నిర్వహణ నుంచి, రైల్వే, బస్, సినిమా టికెట్ల బుకింగ్ వరకూ సెల్ ఫోన్ నంబరుతో మమేకమైన వేళ, అక్రమార్కులు కొత్త మార్గాల్లో దోపిడీని ప్రారంభించారు. సెల్ ఫోన్ నంబర్లను తీసుకుని తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్ స్వాప్ చేస్తూ, కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా సిమ్ స్వాప్ కేసులు పెరుగుతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే, ముందుగా అక్రమార్కులు సిమ్ స్వాప్ ఎలా చేస్తారో తెలుసుకోవాలి. * మోసగాళ్లు బాధితులకు చెందిన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని తొలుత సేకరిస్తారు. * ఆపై మొబైల్ నంబరు సేకరించి, తప్పుడు ఐడీ సృష్టించి డూప్లికేట్ సిమ్ కావాలని మొబైల్ ఆపరేటర్ ను సంప్రదిస్తారు. * నిబంధనలను అనుసరించి బాధితుల సిమ్ కార్డును డీయాక్టివేట్ చేసి అక్రమార్కులకు కొత్త సిమ్ కార్డును మొబైల్ సంస్థ ఇస్తుంది. * ఆపై బ్యాంకు ఖాతా వివరాలతో ఓటీపీ (వన్ టైం పాస్ వర్డ్)ను పొంది, ఖాతాల్లోని మొత్తం డబ్బునూ తెలీకుండానే కొట్టేస్తారు. * సిమ్ పనిచేయదు కాబట్టి, బ్యాంకు లావాదేవీలపై సమాచారాన్ని బాధితులు తెలుసుకోలేరు. సిమ్ స్వాప్ సమస్యను తప్పించుకోవాలంటే... * అకారణంగా సిమ్ కార్డు పనిచేయడం లేదంటే, వెంటనే మొబైల్ ఆపరేటర్ ను సంప్రదించాలి. * ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్, ఏటీఎం పిన్, టెలిఫోన్ పిన్ లను ఎవరికీ చెప్పకూడదు. * సామాజిక మాధ్యమాల్లో మీ ఫోన్ నంబరును పోస్ట్ చేయకూడదు. * మీ సిమ్ కార్డుతో పాటు, ఈ-మెయిల్ కు సైతం బ్యాంకు లావాదేవీల వివరాలు వచ్చేలా ముందుగానే రిజిస్టర్ చేయించుకోవాలి. * ఖాతా వివరాలను, రిజిస్టర్డ్ మొబైల్ నంబరును చెప్పాలని ఎవరు ఫోన్ చేసినా ఎంతమాత్రమూ స్పందించకూడదు. ఈ సలహా సూచనలను పాటిస్తే, సిమ్ స్వాప్ కు గురై మోసగించబడకుండా ఉండేందుకు అవకాశాలు అధికం.

  • Loading...

More Telugu News