: బిల్, హిల్లరీల తొలిచూపుల ప్రేమ కథ... స్వయంగా చెప్పిన క్లింటన్!


డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్ పేరును ప్రకటించిన తరువాత, ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు హర్షధ్వానాలను కురిపించింది. "1971లో వసంతకాలపు వేళ నేను ఓ అమ్మాయిని తొలిసారిగా కలుసుకున్నాను" అనగానే వేలమంది డెమోక్రాట్ ప్రతినిధులతో నిండిన కన్వెన్షన్ సెంటర్ చప్పట్లతో మారుమోగింది. ఆపై ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "మానవ హక్కులు, రాజకీయాలపై న్యాయ కళాశాలలో తరగతులు జరుగుతున్న వేళ ఆమె కనిపించింది. రింగులు తిరిగిన కురులు, పెద్ద కళ్లద్దాలతో మేకప్ లేకుండా, చూడగానే ఏదో ఆకర్షణ శక్తి ఉన్నట్టుగా అనిపించింది. తరగతిలో పాఠం అయిపోగానే, ఆమె వెనకే వెళ్లాను. ఆమె వీపును తగిలేంత దగ్గరగా వెళ్లాను కానీ, ఆ పని చేయలేక పోయాను. ఎలాగైనా పరిచయం చేసుకోవాలని అనిపించింది. కానీ మాటలు మాత్రం కలపలేకపోయాను. ఓ రోజు రాత్రి కాలేజీలో ఉన్న లైబ్రరీలో నా క్లాస్ మేట్ తో మాట్లాతుతున్న వేళ, హిల్లరీ నావైపే చూస్తూ నిలబడింది. కాపేపటికి నా దగ్గరికి వచ్చి, 'నా వైపే ఎప్పుడూ చూస్తుంటావు. నేను నీవైపు చూస్తున్నాను. కనీసం మన పేర్లయినా ఒకరికొకరం చెప్పుకోవాలిగా? నా పేరు హిల్లరీ రోధం. నీవెవరు?' అని అడిగింది. ఒక్కక్షణం నోటమాటరాని నేను తడబడుతూ నా పేరు చెప్పాను. ఆపై రెండు రోజులు ఆమె కనిపించలేదు. తర్వాత తనే వచ్చి నెక్ట్స్ టర్మ్ కు రిజిస్టర్ చేసుకోవాలని వెళుతున్నట్టు చెప్పింది. నేను కూడా వస్తానని ఆమె వెనకాలే నడిచాను. ఇద్దరమూ క్యూలో నిలబడ్డ వేళ, రిజిస్ట్రార్ నన్ను పరికించి చూస్తూ, 'పొద్దున్నే వచ్చి నీ పేరు రిజిస్టర్ చేయించుకున్నావుగా? ఇక్కడేం చేస్తున్నావు?' అని గద్దించి అడిగేసరికి నా ముఖం వాడిపోయింది. అంతే, హిల్లరీ పడీపడీ నవ్వేసింది" అని తమ తొలినాళ్ల ప్రేమ ముచ్చట్లను క్లింటన్ పంచుకున్నారు.

  • Loading...

More Telugu News