: సంచలనం... రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆహారంలో డ్రగ్స్ కలిపిన సాయ్ ఉద్యోగి, మరో రెజ్లర్!
డోపీగా పట్టుబడిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వ్యవహారంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సోనేపత్ సెంటరులో నిర్వహిస్తున్న కేంద్రంలో నర్సింగ్ బస చేసిన వేళ, ఆయన గదికి పంపిన ఆహారంలో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి పంపినట్టు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. ఆహారంలో డ్రగ్స్ కలిపిన వ్యక్తిని గుర్తించామని అన్నారు. అతను సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న రెజ్లర్ సోదరుడని తెలిపారు. ఉత్ప్రేరకాలను కలపడానికి సాయ్ సెంటర్ లో వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి కూడా సహకరించారని తెలిపారు. ఈ మేరకు సాక్ష్యాలు లభించాయని, నేడు ఎఫ్ఐఆర్ నమోదు కానుందని వివరించారు. ఈ వ్యక్తి జూనియర్ లెవల్ లో 65 కిలోల రెజ్లింగ్ విభాగంలో దేశం తరపున ఆడాడని, అప్పుడప్పుడూ సోనేపత్ సెంటర్ కు స్పేరింగ్ పార్ట్ నర్ గా ఉంటుండేవాడని భూషణ్ సింగ్ తెలిపాడు. కేడీ జాదవ్ హాస్టల్ లోని నర్సింగ్ రూం తాళాలను అతను అడిగి తీసుకున్నాడని, ఆపై రూమువద్ద ఇతర ఆటగాళ్లు 'ఇక్కడేం పని?' అని అడుగగా, పొరపాటున వచ్చానని చెప్పాడని పేర్కొన్నారు. కాగా, 74 కిలోల విభాగంలో నర్సింగ్ పోటీ పడాల్సి వుండగా, రియోకు బయలుదేరే వేళ డ్రగ్స్ వాడినట్టు రుజువు కావడంతో ఆయన ప్రయాణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కావాలనే కుట్ర పన్ని నర్సింగ్ యాదవ్ ను ఇరికించారన్న వార్తలు క్రీడా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.