: అమెరికా టూర్ వెనుక కారణాన్ని వెల్లడించిన రజనీకాంత్!
రెండు నెలల పాటు అమెరికాలో వుండి నిన్ననే తిరిగి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన టూర్ వెనుక కారణాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ లేఖను విడుదల చేశారు. భావోద్వేగాలు, విప్లవాత్మక అంశాలతో నిండిన 'కబాలి' చిత్రంతో పాటు, శంకర్ దర్శకత్వం వహిస్తున్న 2.0 (రోబో 2) చిత్రం షూటింగులలో వరుసగా పాల్గొనాల్సిరావడంతో మానసికంగా, శారీరకంగా అలసిపోయానని తెలిపారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని భావించి, తన కుమార్తె ఐశ్వర్య ధనుష్ తో రెండు నెలల పాటు అమెరికా టూర్ కు వెళ్లానని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్నానని చెప్పారు. రెండు నెలల విరామం తరువాత మాతృదేశానికి వచ్చాక కొత్త శక్తి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఆనందంలో ఉండగా 'కబాలి' విజయం మరింత ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత థాను, దర్శకుడు పా రంజిత్, చిత్రయూనిట్ మొత్తానికి ధన్యవాదాలని అన్నారు. అభిమానులు, థియేటర్ల యజమానులు, పంపిణీదారులకు కూడా ధన్యవాదాలని ఆయన లేఖలో చెప్పారు.