: కేవీపీ బిల్లుపై ఈ వారమూ ఓటింగ్ లేనట్టే!... తర్వాతి శుక్రవారం ఓటింగుకి సిద్ధమన్న కురియన్!
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఈ శుక్రవారం కూడా రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశాలు లేవు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ కొద్దిసేపటి క్రితం స్పష్టమైన ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ వాయిదా పడేలా వ్యవహరించిన బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వాదనను తిప్పికొడుతూ బీజేపీ కూడా తనదైన వాదనను వినిపించింది. ఈ సందర్భంగా ఇరువర్గాలను శాంతింపజేసేందుకు యత్నించిన కురియన్ ఓ కీలక ప్రకటన చేశారు. కేవీపీ ప్రతిపాదించిన బిల్లుపై ఈ శుక్రవారం కూడా ఓటింగ్ కు అనుమతించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. సభా నియమాల ప్రకారం ఈ శుక్రవారం తర్వాత వచ్చే శుక్రవారం (ఆగస్ట్ 5)న కేవీపీ బిల్లుపై ఓటింగ్ కు సిద్ధమని ఆయన ప్రకటించారు.