: ఆప్ లోకి సిద్ధూ ఎంట్రీ నేడే!... కీలక ప్రకటన చేయనున్న మాజీ క్రికెటర్!
కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి భారీ షాకిచ్చిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేడు కీలక ప్రకటన చేయనున్నారు. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరేందుకే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారాల వ్యవధిలోనే ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున సిద్ధూ ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ... ఆప్ లో చేరే విషయానికి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నేటి ఉదయం 11.30 గంటలకు ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభకు రాజీనామా, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సిద్ధూ కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం.