: కృష్ణా పుష్కర యాత్రికుల కోసం 'సిద్ధార్థ' యాత్ స్పెషల్ యాప్


మరో రెండు వారాల్లో ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల కోసం తరలివచ్చే అశేష జనవాహినికి లాభం కలిగేలా విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాల యువతీ యువకులు ప్రత్యేక యాప్ ను సిద్ధం చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చేస్తున్న సన్నాహకాలకు సాంకేతిక సాయం అందించాలన్న ఉద్దేశంతో, పుష్కరాలకు సంబంధించి సమస్త సమాచారంతో దీన్ని రూపొందించారు. ఎక్కడెక్కడ ఘాట్లు ఉన్నాయి? వసతి సౌకర్యాలు ఎక్కడున్నాయి? వాటికి చేరే మార్గాలు తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు. పుష్కర సమయాల్లో రద్దీ ఎక్కువగా ఎక్కడ ఉంది? ఏ ఘాట్ కు వెళితే త్వరగా స్నానం ముగించవచ్చు... ఇత్యాది వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటామని విద్యార్థులు తెలిపారు. బస్సు, రైల్వేల సమాచారాన్ని సైతం యాప్ లో అందుబాటులో ఉంచనున్నామని పేర్కొన్నారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలోని ఇతర ఘాట్లు, గుంటూరు జిల్లాలో ఏర్పాటైన ఘాట్లకు చెందిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చని తెలిపారు. పుష్కర సమాచారంతో పాటు ఘాట్లలో చేయకూడని, చేయాల్సిన పనులు, 12 రోజుల్లో నిర్వహించాల్సిన పూజా విధానం, సమీప దేవాలయాలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. 'కృష్ణా పుష్కరాలు 2016' పేరిట యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్, 9 యాప్స్ వంటి ప్రముఖ యాప్ స్టోర్లలో లభిస్తుందని విద్యార్థులు వివరించారు.

  • Loading...

More Telugu News