: 63 ఏళ్లలో తొలిసారి!... విండీస్ పై రికార్డు విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన!
‘హ్యాట్రిక్ సిరీస్’ లక్ష్యంగా కరీబియన్ గడ్డపై కాలు మోపిన కోహ్లీ సేన తొలి టెస్టులోనే రికార్డు విజయాన్ని నమోదు చేసింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి వెస్టిండిస్ నగరం అంటిగ్వాలో ముగిసిన తొలి టెస్టును టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో చేజిక్కించుకుంది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. 63 ఏళ్లుగా విండీస్ లో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటిదాకా ఇన్నింగ్స్ తేడాతో కరిబీయన్ జట్టుపై విజయం సాధించలేదు. భాతర జట్టు తరఫున హేమాహేమీలు అక్కడికి వెళ్లినా సాధ్యం కాని రికార్డు విజయాన్ని కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సాధించాడు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ... తన కెరీర్ లోనే డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, స్పిన్నర్ గా బరిలోకి దిగిన రవిచంద్రన్ అశ్విన్ కూడా తన కెరీర్ లోనే తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండిస్ జట్టును భారత బౌలర్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి ఫాలోఆన్ లో పడేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండిస్ బ్యాటింగ్ ఆర్డర్ ను అశ్విన్ కుప్పకూల్చాడు. ఫలితంగా 63 ఏళ్ల చరిత్రలో తొలిసారి టీమిండియా కరీబియన్ గడ్డపై ఇన్నింగ్స్ తేడాతో వెస్టిండిస్ జట్టుపై విజయం సాధించింది.