: కాశ్మీర్ చెల్లెమ్మను బాధపడవద్దని, త్వరలోనే మీ దగ్గరకు చేరుకుంటానని చెప్పాను: హఫీజ్ సయ్యద్
దుఖ్తరాన్-ఏ-మిల్లత్ చీఫ్, కాశ్మీర్ వేర్పాటువాద మహిళా నేత (ఆసియా ఆంద్రాబి) ఇటీవల తనకు ఫోన్ చేసి కాశ్మీర్ లో కర్ఫ్యూ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి చెప్పిందని, పదిహేను నిమిషాల సేపు మాట్లాడిన చెల్లెలు కన్నీటి పర్యంతమైందని ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ అన్నాడు. ‘కాశ్మీర్ కార వాన్’ పేరుతో రెండు రోజుల క్రితం లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు భారీ ర్యాలీని సయ్యద్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రోజు ర్యాలీ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న గుజ్రాన్ వాలా పట్టణంలోకి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ‘చెల్లెమ్మ నాకు ఫోన్ చేసి ఏడిస్తే, బాధ పడవద్దని చెప్పాను. మనం యుద్ధం చేస్తున్నాం, త్వరలోనే మేం మీదగ్గరికి చేరుకుంటామని ఓదార్చాను. హిజబుల్ కమాండర్ బుర్హాన్ వని చివరి కోరిక నన్ను కలవడమే. అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడాలనే కోరిక తీరిందని, ఇక మిగిలింది అమరత్వమేనని చెప్పాడు. నాతో చెప్పినట్లే చేశాడు’ అని జమాత్ ఉల్ దవా చీఫ్ సయ్యద్ పేర్కొన్నాడు.