: ‘కబాలి’ విడుదల రేపే!... స్టే విధించలేమన్న మద్రాస్ హైకోర్టు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. చిత్రం విడుదలను నిలుపుదల చేయించేందుకు జరిగిన యత్నాలన్నింటినీ మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. బ్లాక్ టికెట్ల వివాదం నేపథ్యంలో విడుదలను వాయిదా వేయాలన్న పిటిషన్ ను నిన్న కొట్టేసిన హైకోర్టు... తమ నష్టాలను భర్తీ చేస్తామన్న హామీని మరచిన రజనీ, చిత్ర నిర్మాత కలైపులి థానులపై చర్యలు తీసుకోనేలా ‘కబాలి’ విడుదలపై స్టే విధించాలన్న డిస్ట్రిబ్యూటర్ల పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తైన నేపథ్యంలో చివరి క్షణంలో చిత్రం విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో రేపు ‘కబాలి’ థియేటర్లలో సందడి చేయనుంది. హైకోర్టు తీర్పుతో రజనీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.