: అమితాబ్ రికమండేషన్ తో హీరోనయ్యానంటున్న అల్లరి నరేష్!
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ రికమండేషన్ తో హీరోనయ్యానని కామెడీ హీరో అల్లరి నరేష్ తెలిపాడు. 'సెల్ఫీ రాజా' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అల్లరి నరేష్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణం ఉండడంతో సినిమాల్లోకి రావాలని ఉండేదని, అయితే నటుడిగా కాదని, నిర్మాత లేదా దర్శకుడిగా రావాలని అనిపించేందని అన్నాడు. 'చాలా బాగుంది' సినిమాకు క్యాషియర్ గా చేస్తున్నప్పుడు హీరో కావాలనే కోరిక కలిగిందని, పీలగా, పొడుగ్గా ఉన్న తనను ఎవరైనా చూస్తారా? అసలు హీరో అవ్వాలనుందని నాన్నకు చెప్పడం ఎలా? వంటి అనుమానాలన్నీ ఉండేవని నరేష్ తెలిపాడు. అయితే 'చాలా బాగుంది' సినిమా శతదినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అమితాబ్ బచ్చన్ తనను చూసి, మా అభిషేక్ లా నీ కొడుకు కూడా పొడుగ్గా ఉన్నాడు. హీరోను చెయ్యి అని సలహా ఇచ్చారని చెప్పాడు. దీంతో ధైర్యం కూడదీసుకుని హీరో అవుతానని ఒకరోజు నాన్నతో చెప్పానని, తరువాత జరిగిందంతా మీకు తెలిసిందేనని అల్లరి నరేష్ చెప్పాడు. ఆ విధంగా అమితాబ్ రికమండేషన్ తో తాను హీరోనయ్యానని ఈ నరేష్ తెలిపాడు.