: ‘కబాలి’ విడుదలపై స్టేకు మద్రాస్ హైకోర్టు ససేమిరా... సంతోషంలో రజనీ అభిమానులు!
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘కబాలి’ విడుదలను వాయిదా వేసేందుకు మద్రాస్ హైకోర్టు ససేమిరా అంది. చిత్రం టికెట్లను బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీంతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు నిన్న కొట్టేసింది. ‘కబాలి’ చిత్ర ప్రదర్శనకు ఎంపికైన థియేటర్ల యజమానులు, చిత్ర నిర్మాత కలైపులి థానుతో కలిసి ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని, దీనిపై తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు, ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తూ చెన్నైలోని సెంబియంకు చెందిన దేవరాజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధిక ధరలకు టికెట్లు విక్రయించినందున ‘కబాలి’ చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై నిన్న మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్, చిత్ర నిర్మాత తరఫు న్యాయవాదులు చేసిన వాదనను విన్న ధర్మాసనం విడుదలను వాయిదా వేయడం కుదరదని చెబుతూ పిటిషన్ ను కొట్టేసింది. కోర్టు నిర్ణయంతో రజనీ అభిమానుల్లో సంతోషం వెల్లివిరిసింది.